Book Release on 20th September 2026 at Pallesrujana Office  
 

 

 

నల్లమల అడవుల పరిరక్షణ, అభివృద్ధి కోసం తన జీవితాన్ని త్యాగం చేసి, అడవుల సంరక్షణకు అహర్నిశలు కృషి చేస్తూ, ఎన్నో వృక్షాలు, మొక్కలు, ఔషధ వృక్షాలు, వన్యప్రాణులు, పక్షులను కాపాడిన ఒక అడవి బిడ్డ యదార్థ కథ ఇది.
ఫారెస్ట్ మ్యాన్ & పర్యావరణ యోధుడిగా అందరికీ సుపరిచితుడైన కె. అంకారావు ఈ పేరు తెలియని ప్రకృతి ప్రేమికులు దాదాపుగా ఎవరూ ఉండరు. అయితే అసలు ఆయన అడవుల్లోకి ఎందుకు వెళ్లాడు? చిన్న వయసులోనే నల్లమల అడవుల్లోకి అడుగుపెట్టడానికి కారణాలు ఏమిటి? అడవిని తన జీవితంగా మార్చుకునేంతగా ఆయనను ప్రభావితం చేసిన సంఘటనలు ఏమిటి?
ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే ఆయన జీవిత ప్రయాణాన్ని, నల్లమల అడవులతో ఆయనకు ఏర్పడిన అనుబంధాన్ని తెలుసుకోవాలి.
నల్లమల అడవుల పక్కనే తన పుట్టుకను ప్రారంభించి, చిన్న వయసులోనే అడవిలోకి అడుగుపెట్టిన ఆయన, క్రమంగా ఆ అడవినే తన జీవితంగా భావించాడు. అడవులను కేవలం చెట్లు, మొక్కల సమూహంగా కాకుండా, తనను కన్న అడవి తల్లిగా భావించాడు. అడవిలోని ప్రతి చెట్టును, ప్రతి మొక్కను, ప్రతి ఔషధ వృక్షాన్ని, ప్రతి జీవిని తన కుటుంబ సభ్యుడిలా ప్రేమించాడు.
అడవుల్లోకి అడుగుపెట్టిన ప్రతి రోజు ఆయనకు ఒక కొత్త అనుభవమే. ఒక్కోసారి ప్రకృతి అందాలు మనసును పరవశింపజేస్తే, మరికొన్ని సందర్భాల్లో అడవి ఎదురుగా నిలబెట్టిన ప్రమాదాలు ఒళ్లు గగుర్పొడిచేలా చేసేవి. చీకటి పడిన తర్వాత అడవిలో ఒంటరిగా ప్రయాణించడం, నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ వినిపించే వన్యప్రాణుల శబ్దాలు, అకస్మాత్తుగా ఎదురయ్యే ప్రమాదకర పరిస్థితులు, ఊహించని ప్రకృతి మార్పులు ఇవన్నీ ఆయన జీవిత ప్రయాణంలో భాగమయ్యాయి.
అయినా ఆయన వెనక్కి తగ్గలేదు.
ఎందుకంటే అడవిపై ఉన్న ప్రేమ, ప్రకృతిని కాపాడాలనే బాధ్యత, వన్యప్రాణులపై ఉన్న మమకారం ఆయనను ముందుకు నడిపించాయి. అడవికి హాని కలిగించే ప్రతి చర్యను గమనిస్తూ, ప్రకృతి పరిరక్షణ కోసం తన వంతు కృషి చేస్తూ, ఎన్నో వృక్షాలు, మొక్కలు, ఔషధ వృక్షాలు, వన్యప్రాణులు, పక్షులను కాపాడేందుకు శ్రమించాడు.
అడవుల్లో తాను చూసిన ప్రతి సన్నివేశాన్ని, అడవి తల్లి కన్నీరు పెట్టుకునే ప్రతి సందర్భాన్ని, వన్యప్రాణుల జీవన విధానాన్ని, పక్షుల ఆటపాటలను, ప్రకృతి అందాలను, ప్రకృతి ఎదుర్కొనే కష్టాలను తన అనుభవాల ద్వారా మన కళ్లముందు నిలిపే ప్రయత్నం చేశాడు.
ఏ సమయంలో అడవుల్లో ఎలాంటి మొక్కలు ఉంటాయి? వేసవికాలంలో అడవి ఎలా ఉంటుంది? వర్షాకాలంలో ప్రకృతి ఎలా మారుతుంది? శీతాకాలంలో అడవి రూపం ఎలా ఉంటుంది? పగటి వేళ అడవి ఎలా కనిపిస్తుంది? రాత్రి వేళ అడవి ఎలా ఉంటుంది? అమావాస్య రోజు రాత్రి నల్లమల అడవి ఎలా ఉంటుంది? కార్తీక పౌర్ణమి రోజు అడవి ఎలా ఉంటుంది?
ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు ఆయన అనుభవాల ద్వారా ఈ పుస్తకంలో కనిపిస్తాయి. వన్యప్రాణుల జీవన విధానం, వాటి ఆటపాటలు, అడవి ఆనందం, అడవి కష్టం, ప్రకృతి అందం, ప్రకృతి కన్నీరు ఇవన్నీ మూడు దశాబ్దాలకు పైగా నల్లమల అడవుల్లో ఒంటరిగా తిరుగుతూ తాను చూసిన ప్రతి సన్నివేశాన్ని, చదివే వారి కళ్లతో వారు స్వయంగా చూసేలా అద్భుతమైన శైలిలో రాశాడు.
ఈ పుస్తకంలో ప్రకృతి అందాలను మాత్రమే కాదు.ఒళ్లు గగుర్పొడిచే అడవి సన్నివేశాలను కూడా మన కళ్లముందు నిలిపే ప్రయత్నం చేశాడు. అడవి నిశ్శబ్దంలో దాగి ఉన్న భయం, చీకటిలో వినిపించే తెలియని శబ్దాలు, వన్యప్రాణుల ఉనికి, ప్రకృతి ఒక్కసారిగా మార్చుకునే రూపం ఇవన్నీ చదువుతున్నప్పుడు మనం కూడా ఆ అడవిలోనే ఉన్నామా అన్న అనుభూతిని కలిగిస్తాయి.
ఈ పుస్తకం చదువుతూ ఉంటే, మనం కూడా నల్లమల అడవుల్లో ఒంటరిగా, ఏకాంతంగా తిరుగుతున్నట్టుగా ఒక కొత్త, వింత అనుభూతి కలుగుతుంది. అడవిలోని ప్రతి శబ్దం మన చెవులకు వినిపిస్తున్నట్టుగా, ప్రతి చెట్టు మన కళ్లముందు కనిపిస్తున్నట్టుగా, ప్రతి వన్యప్రాణి మనతోపాటు నడుస్తున్నట్టుగా అనిపిస్తుంది.
ఒక్కసారి ఈ పుస్తకాన్ని చదవడం ప్రారంభిస్తే,ప్రకృతి ఇంత అందంగా ఉంటుందా? అడవి ఇంత అద్భుతంగా ఉంటుందా? అని ఆనందంతో పరవశించిపోతారు. అదే సమయంలో అడవి ఎదుర్కొంటున్న కష్టాలను చూసి మనసు కలచివేస్తుంది. ఒక కొత్త ప్రపంచం మీకు స్వాగతం పలుకుతున్న అనుభూతి కలుగుతుంది.
బొమ్మా బొరుసు ఉన్నట్టుగానే, ప్రకృతిలో ఆనందం మాత్రమే కాదు, కష్టం కూడా ఉంటుంది. అడవికి ఒక అందమైన రూపం ఉంటే, మరోవైపు అది ఎదుర్కొనే ఎన్నో కష్టాలు, బాధలు, కన్నీళ్లు కూడా ఉంటాయి. ఈ రెండు కోణాలను ప్రకృతి ఆనందాన్ని, ప్రకృతి కష్టాన్ని రెండింటినీ అద్భుతంగా ఆవిష్కరించిన యదార్థ కథ ఇది.
నల్లమల అడవుల కోసం కె. అంకారావు చేసిన సేవ ఎంత గొప్పదో, అడవితో ఆయనకు ఉన్న అనుబంధం ఎంత లోతైనదో, ప్రకృతి పరిరక్షణ కోసం ఆయన తన జీవితాన్ని ఎలా అంకితం చేశాడో ఈ పుస్తకం అద్భుతంగా చూపిస్తుంది.
ప్రతి ప్రకృతి ప్రేమికుడు, పర్యావరణంపై సామాజిక స్పృహ ఉన్న ప్రతి ఒక్కరూ తప్పక చదవాల్సిన పుస్తకం ఇది.
ఇది కేవలం ఒక పుస్తకం కాదు.
నల్లమల అడవుల మధ్య మూడు దశాబ్దాలకు పైగా సాగిన ఒక అడవి బిడ్డ ప్రయాణం.
ఫారెస్ట్ మ్యాన్‌గా, పర్యావరణ యోధుడిగా ఆయన చేసిన సేవల గాథ.
ప్రకృతిని ప్రేమించిన ఒక మనిషి జీవితగాథ.
అడవి ఆనందాన్ని, అడవి కష్టాన్ని, ప్రకృతి అందాన్ని, ప్రకృతి కన్నీటిని, ఒళ్లు గగుర్పొడిచే అడవి సన్నివేశాలను మన కళ్లముందుకు తీసుకొచ్చే ఒక యదార్థ కథ.
ఈ పుస్తకం చదువుతుంటే
నల్లమల అడవుల్లోకి అడుగుపెడుతున్న అనుభూతి కలుగుతుంది .
ప్రకృతి ఒడిలోకి తీసుకెళ్తుంది .
మీకు తెలియని ఒక కొత్త ప్రపంచం మీకు స్వాగతం పలుకుతుంది.